ప్రతి ఒక్కరి మనసునూ కదిలించే ఈ సంఘటనను ఒక్కసారి చదవండి

January 12, 2017

నేను కొందరు మిత్రులతో కలిసి ఒక ఆశ్రమానికి వెళ్లాను.
అక్కడున్న ఒక వృద్ధురాలిని , ఈ ఆశ్రమ నిర్వాహకులు ఎవరు అవ్వా ……?
అని అడిగాము.

కాషాయ దుస్తుల్లో దాదాపుగా డెబ్బై ఏళ్ళ ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ ,
ఆయనే బాబూ ….ఇక్కడ మా బాగోగులన్నీ చూసుకునేది అని వణుకుతున్న గొంతుతో చెప్పింది ఆమె.

ka1

దూరం నుండే మమ్మల్ని గమనించిన అతను ,
సాదరంగా మమ్మల్ని ఆహ్వానించి …… ఆశ్రమం లోపలికి తీసుకెళ్ళారు.

కుర్చీల్లో కూర్చొని ఆమాటా ఈమాటా మాట్లాడిన తర్వాత ,
“ బాబూ ….! మీ పేరు ఎన్నో సార్లు విన్నాను నాయనా ……..
చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటావంట కదా ……” అని ఆ పెద్దాయన అన్నారు.

“ అవును స్వామీ , ఎవరైనా కష్టాల్లో ఉంటే నా చేతనైనంతలో గత ఎనిమిదేళ్లుగా సాయం చేస్తూ వస్తున్నాను అని చెబుతూ …….. , ఈ ఆశ్రమంలోని వృద్దులకు
నా వంతుగా ఏదైనా సాయం కావాలంటే చెప్పండి స్వామీ “ అని అడిగాను.

ka3

అప్పుడు ఆ పెద్దాయన ఇలా చెప్పారు :

“ బాబూ ….! గత పదేడేళ్ళుగా , ఈ ఆశ్రమంలో ఏ ఆసరా లేని , పూర్తిగా నడవలేని స్థితిలో , చివరి దశలో ఉన్న వృద్ధులనే ఎక్కువగా చేర్చుకుంటున్నాను.
అంతిమ ఘడియల వరకూ అన్నీ దగ్గరుండి చూసుకుంటాను.

ఎవరైనా మరణిస్తే …… నేనే భుజాలపై శ్మశానానికి మోసుకెళ్ళి …….
దగ్గరుండి అంత్యక్రియలన్నీ జరిపిస్తున్నాను.
ఈ కార్యాలలో నా భార్య కూడా పాల్గొని నాకు సహరిస్తోంది.

కానీ ఈ మధ్య మా ఇద్దరికీ వయసు మీద పడటంతో ,
మరణించిన వారిని మా భుజాలపై మోయలేకుండా ఉన్నాము బాబూ…!
ఈ విషయంలో మీరు మాకొక సాయం చేయాలి అని గద్గద స్వరంతో చెప్పారు.

ka4

సరే స్వామీ …. మరణించిన వారిని శ్మశానానికి సులువుగా తీసుకెళ్ళడానికి వీలుగా మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఒక వ్యాన్ ను ఏర్పాటు చేస్తాను అని
నేను చెప్పబోతుండగానే …………

బాబూ ….. బాబూ …. వద్దు బాబూ ….. మాకోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టి
మోటారు వాహనం వద్దు బాబూ ……! బాధల్లో ఉన్న ఎందరో అభాగ్యులను
మీరు ఆదుకుంటున్నారు …… ఆ డబ్బును వాళ్లకు ఖర్చు పెట్టండి ……

మాకు ఒక తోపుడు బండిని ఇవ్వండి చాలు …… ఇప్పుడు భుజాలపై మోసే శక్తి లేదు కాబట్టి మరణించిన వారిని ఆ తోపుడు బండిపై నా చేతులారా త్రోసుకుంటూ శ్మశానానికి తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు జరిపిస్తాను ,
అందులోనే నాకు తృప్తి ఉంది “ అని ఆర్ద్రతతో అన్నారు.

ఆశ్చర్యపోవడం మావంతు అయింది. మాకు నోట మాటలు రాలేదు.
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ పెద్దాయన వంక అలాగే చూస్తూ ఉండిపోయాము.

కొద్దిసేపటి తర్వాత మేము తేరుకొని ……..
“ తప్పకుండా స్వామీ ….!
ఒక గొప్ప పుణ్య కార్యాన్ని మా చేతులారా చేయించే భాగ్యం మాకు కల్పించారు , మీవంటి ఉన్నత వ్యక్తిత్వం గల మనిషిని కలుసుకునే భాగ్యం మాకు దక్కింది …… మీకు హృదయపూర్వకంగా పాదాభివందనాలు స్వామీ “ అని
అక్కడి నుండి గుండెల నిండా ఆత్మ తృప్తితో ,
జీవితానికంతా సరిపడే ఆనందంతో వెలుపలికి వచ్చాము.

  • గోపిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...