14 ఏళ్ల కుర్రాడు 5 కోట్ల కాంట్రాక్టును ఎలా సాధించాడంటే ………

January 13, 2017

అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మేధస్సు ఉంటే చాలు ….. వయసుతో పనేముంది అని బల్లగుద్ది చెప్పే విషయమిది. ఒక 14 ఏళ్ల  ఓ చిన్న కుర్రాడు గుజరాత్ లో జరుగుతున్న వైబ్రంట్ సదస్సుకు వచ్చాడు. తాను డిజైన్ చేసిన డ్రోన్‌ను అక్కడివారికి చూపించాడు.. అంతే, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తమకు అలాంటి డ్రోన్ కావాలంటూ అతడితో 5 కోట్ల రూపాయలకు ఎంఓయూ కుదుర్చుకుంది.

hrdv

పదో తరగతి చదువుతున్న హర్షవర్ధన్ జాలా… ఏరోబాటిక్స్ 7 టెక్ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యవస్థాపకుడు, సీఈఓ. గుజరాత్ ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాఖ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధ ప్రాంతాల్లోను, సరిహద్దుల్లోను మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడే మూడు  నమూనా డ్రోన్లను అతడు రూపొందించాడు.

గత సంవత్సరం నుండి తాను ఈ తరహా డ్రోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టానని, టీవీ చూస్తున్నప్పుడు చాలామంది సైనికులు మందుపాతరలు పేలి చనిపోవడం.. తీవ్రంగా గాయపడటం లాంటి ఘటనలు చూసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు.

ఈ మూడు నమూనా డ్రోన్లు తయారుచేయడానికి 5 లక్షలు ఖర్చయినట్లు తెలిపాడు. ఈ డ్రోన్‌లో ఇన్‌ఫ్రారెడ్, ఆర్‌జీబీ సెన్సర్ ఉంటుందని, దాంతోపాటు థర్మల్ మీటర్, 21 మెగాపిక్సెళ్ల కెమెరా, మెకానికల్ షట్టర్ ఉన్నట్లు తెలిపాడు హర్షవర్ధన్.

వీటి సాయంతో ఇది హై రిజల్యూషన్ ఫొటోలు తీసి పంపుతుందని వివరించాడు. భూమికి 2 అడుగుల ఎత్తున ఎగురుతూ, 8 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఈ డ్రోన్ కవర్ చేస్తుంది. ఆ పరిధిలో ఎక్కడైనా మందుపాతరలను గుర్తిస్తే వెంటనే బేస్ స్టేషన్‌కు తెలియజేస్తుంది.

ఇందులో 50 గ్రాముల బరువున్న బాంబు ఒకటి ఉంటుంది. అది మందుపాతరను ధ్వంసం చేస్తుంది. తన కంపెనీ ఏరోబాటిక్స్ పేరు మీద ఈ డ్రోన్‌కు ఇప్పటికే పేటెంట్ కూడా రిజిస్టర్ చేసేశాడు.

హ్యాట్సాఫ్ టు హర్షవర్ధన్

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...