పెళ్ళిళ్ళు కాని యువతీ యువకులు అక్కడికే ఎందుకు వెళతారంటే…..

December 1, 2016

వివిధ రకాల దోషాలతో పెళ్ళిళ్ళు కాని చాలా మంది యువతీ యువకులందరూ కృష్ణా జిల్లా మోపిదేవి లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ను సందర్శిస్తూ ఉంటారు.

దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం.

mopidevi-subramanya-swami

పురాణ ప్రాశస్త్యం ఏమిటంటే …………

కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు.

పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమైపోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి గా స్ధిరపడిందని చెపుతారు.

ఇక్కడి క్షేత్ర విశిష్టత ఏమిటంటే …….

స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానవట్టం. స్వామికి వేరే పానవట్టం ఉండదు. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో వరాలు లభిస్తాయని నమ్మకం.

ఆలయం లో చేసే విశేష పూజలు ఇవే……
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు.స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి.

ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలంటే ……..

కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపి దేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.

స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు ప్రత్యేక పూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలుగా చెప్పుకుంటారు.

 

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...