కొడుకులూ , కోడళ్ళూ ఈ కుక్కను చూసి ఎంతో నేర్చుకోవాలి

November 30, 2016

వీధి చివర ఓ బస్ షెల్టర్ పక్కన కాలికి దెబ్బ తగలడంతో దీనంగా పడి ఉన్న ఒక కుక్క పిల్లను చూసిన వెంకటయ్య, అయ్యో పాపం……….. అనుకుంటూ, దానిని దగ్గరకు తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు.

ఇంటికెళ్ళగానే వెంకటయ్య తో పాటు ఉన్న కుక్కపిల్లను చూసిన అతని కొడుకుకు, కోడలుకు చిర్రెత్తుకొచ్చింది.

“ నీకు అన్నం పెట్టడమే దండగ అనుకుంటుంటే, మళ్ళీ ఇప్పుడు దీనికి కూడానా……! వీధిలో ఉన్న వాటినంతా ఇలా ఇంట్లోకి తీసుకొస్తే ఎలా…..! అని నానామాటలు అన్నారు.

వెంకటయ్య ఏమీ మాట్లాడకుండా, ఆ కుక్కపిల్ల గాయానికి మందు రాసి, కొంచెం పాలు పోసి దాని ఆకలి తీర్చాడు.

dog

ఆరు నెలలు గడిచాయి.

వెంకటయ్య తాను తినే దాంట్లో కొంత పక్కకు తీసి, కుక్క పిల్లకు పెడుతూ దానిని కన్నబిడ్డలా పెంచుకుంటున్నాడు.

ఒకరోజు వెంకటయ్యకు జ్వరం ఎక్కువగా వస్తుండటంతో మంచంలో పడుకుని ఉన్నాడు. పక్కనే ఆ కుక్క దీనంగా అతన్నే చూస్తూ కూర్చొంది.

అప్పుడే కొడుకు ఇంట్లోకి రావడాన్ని చూసిన వెంకటయ్య , “ జ్వరం చాలా ఎక్కువగా ఉంది రా…..! ఒళ్లంతా బాగా నొప్పులుగా ఉంది, ఒక్క టాబ్లెట్ తెచ్చివ్వరా….! అని వేడుకున్నట్లుగా అడిగాడు.

అంతలోనే పక్క గదిలో నుండి వచ్చిన కోడలు, “ నువ్వు బతికి ఇంకా ఏం ఉద్దరించాలనుకుంటున్నావ్…..! టాబ్లెట్ లేదు…… టానిక్ లేదు………ఏమీ లేదు అని చీదరించుకొంది.

దానికి వెంకటయ్య, “ నేనడిగింది ఒక్క టాబ్లేటే కదమ్మా………..! ఈ నొప్పులను తట్టుకోలేకుండా ఉన్నానమ్మా……..! అని దీనంగా అన్నాడు.

“ ఈ రోజు టాబ్లెట్ అంటావ్…. , రేపు హాస్పిటల్ అంటావ్….., ఇక్కడ డబ్బులేమీ చెట్లకు కాయడం లేదు” అని కసురుకొంది ఆ కోడలు.

ఇదంతా పక్కనే నిలబడి వింటున్న కొడుకు, “ నిన్ను భరించడం మావల్ల కావడం లేదు, ఊరి బయట ఉన్న ఆశ్రమం వద్ద విడిచిపెడతాను, అక్కడ ఉండిపో………” అని ఆటోను పిలిచి వెంకటయ్యను అందులో ఎక్కించుకున్నాడు. ఆ ఆటో వెనకాలే వెంకటయ్య కోసం కుక్క కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది.

ఆశ్రమం ఇంకో పది అడుగుల దూరంలో ఉండగానే, వెంకటయ్యను ఆటో నుండి దింపేసి వెళ్లాడు కొడుకు.

కానీ ఆ కుక్క మాత్రం ఆటోతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళకుండా, వెంకటయ్యతో పాటే ఆశ్రమం లోపలికి వెళ్ళింది.

అక్కడ ఉన్న వాళ్లకు తనకు జరిగిందంతా చెప్పి, తన కుక్క విషయం కూడా చెప్పాడు వెంకటయ్య.

అప్పుడు ఆ ఆశ్రమం వాళ్ళు, “ నీతో పాటుగా ఆ కుక్కను కూడా ఇక్కడే ఉండనివ్వు………, ఇంత మంది ఆకలి తీరుస్తున్నాం…………, ఆ మూగ జీవికి పిడికెడు అన్నం పెట్టడం మాకేమీ బరువు కాదంటూ…..” వెంకటయ్య భుజం మీద ఆప్యాయంగా చేయి వేసారు.

వెంకటయ్య కన్నీరు పెడుతూ, తన కుక్కను దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా తలపై నిమిరాడు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...