తిరుమలకు ఏడెనిమిది నడక దారుల గుండా చేరుకోవచ్చని మీకు తెలుసా……. ?

October 26, 2016

తిరుమలకు వెళ్ళే నడకదారులు అలిపిరి , శ్రీవారి మెట్టు అని మనలో చాలా మందికి తెలుసు.
కానీ తిరుమలకు చేరుకోవడానికి ఇవి రెండే కాకుండా మరికొన్ని నడక దారులు కూడా ఉన్నాయని మీకు తెలుసా…… ? అయితే ఒక్కసారి దీనిని చదవండి.

తిరుమలకు చేరుకోవాలంటే కొందరు భక్తులు బస్సుల్లోనూ,టాక్సీలలోనూ,
ఇంకొందరు నడుచుకుంటూ వెళ్తుంటారు.

శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి.

alipiri

అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి. అలిపిరి అంటే ‘ఆదిపడి’ అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.

అలిపిరి నుండి మెట్ల దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు. అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ, 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ,..1628లో నిర్మించారు.

తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.

చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయటి ఊర్లో వారికీ అంతగా తెలియదు.

ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది.

ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రేనాడు వారు ఈ దారి మీదుగానే తిరుమల చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది.పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకుల కొండ వస్తుంది. ఈ కాకుల కొండ మీదుగా వెళ్ళి తిరుమల చేరుకోవచ్చు.

కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలా దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడినుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి.

కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు.తుంబుర లోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది. పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

అవ్వాచారి కొండ నుండి కూడా ఒక దారి ఉంది. దీన్నే అవ్వాచారి కోన దారి అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది.

ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు.

తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు, ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు.

2 Comments

on తిరుమలకు ఏడెనిమిది నడక దారుల గుండా చేరుకోవచ్చని మీకు తెలుసా……. ?.
  1. K. Brahmanandam
    |

    Very interesting unknown matter to all. Now it is clearly informed and excellent information.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...