వృద్ధురాలిని ఆదుకున్న స్నేహ హస్తం సొసైటీ

November 24, 2016

ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు. వయసు పైబడిన తల్లిదండ్రులకు వృద్ధాప్యం శాపం కాకూడదు. ఈ పోస్ట్ ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి.

ఈ ఫోటోలోని వృద్ధ మహిళ పేరు సుబ్బమ్మ. ఈమె భర్త 10 సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు 6 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ లో మరణించాడు. కొడుకు బ్రతికున్నంతవరకు ఈమెను బాగానే చూసుకున్నాడు. ఎప్పుడైతే అతను లోకాన్ని వీడాడో, అప్పటి నుండి ఈమెకు కష్టాలు మొదలయ్యాయి.

dsc09215

కోడలు పూర్తిగా ఆమె బాగోగులు పట్టించుకోవడం మానుకుంది. దానికితోడు సూటి పోటి మాటలతో తీవ్రంగా బాధపెట్టడమే పనిగా పెట్టుకుంది. ఆస్థమా వల్ల తీవ్రంగా దగ్గుతూ మంచంలో పడిపోయి , లేవలేనిస్థితిలో ఉన్నా కూడా కనీసం పలకరించలేదు.సుబ్బమ్మ తీవ్రంగా తల్లడిల్లిపోయింది.

ఆస్థమా బాధ తట్టుకోలేక , తనను ఆసుపత్రికి తీసుకెళ్ళమని కోడలిని చేతులు పట్టుకొని బ్రతిమలాడింది. ఆమె చేతులను విసరికొట్టి ఈసడించుకుంది. “ నాకు నెలనెలా వచ్చే వృద్ధాప్య పెన్షన్ డబ్బులన్నీ నీ చేతికే ఇస్తున్నాను కదమ్మా…….దానిలో నుండి ఓ రెండు వందలు ఇవ్వమ్మా………..నేనే వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుంటాను , ఈ దగ్గుతో ఊపిరి ఆడక చాలా బాధపడుతున్నానమ్మా ……” అని చేతులెత్తి వేడుకుంది. కానీ ఆ కోడలు కనికరించలేదు. “ నీకు తిండి పెట్టడమే దండగ అని నేను అనుకుంటూ ఉంటే…….. నువ్వు మళ్ళీ పెన్షన్ డబ్బుల గురించి అడుగుతావా ……….అంటూ నానా దుర్భాషలాడుతూ కట్టుబట్టలతో సుబ్బమ్మను ఇంట్లో నుండి గెంటివేసింది.

ఆమె ఇంట్లో నుండి ఏడుస్తూ వెళ్ళి , ఒక దేవాలయం ప్రక్కన చెట్టు క్రింద సొమ్మసిల్లిపడిపోయింది.
ఈ విషయం మా స్నేహహస్తం సొసైటీ దృష్టికి వచ్చింది. నేను , కొందరు మిత్రులతో కలిసి ఆమె వద్దకు వెళ్ళాను. వెంటనే ఆమెకు వైద్యం చేయించి , ఆహారం , వస్త్రాలు ఇచ్చి ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ, నా కోడలు పెట్టిన బాధలు ఎవరికీ రావొద్దయ్యా……. అని భోరున విలపిస్తూ తన బాధనంతా చెప్పుకుంది.

దయచేసి ఇళ్ళల్లో ఉన్న వృద్ధులను ఆప్యాయంగా చూసుకోండి.

ఆత్మీయతతో సేవలు చేసి , అనుబంధాల విలువను పెంచండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...