బ్రిడ్జీపైకి రాజకీయనాయకులకు నో ఎంట్రీ అని చెప్పిన గ్రామ ప్రజలకు హాట్సాఫ్ ……..

November 3, 2016

ఆ బ్రిడ్జి పై రాజకీయనాయకులకి ప్రవేశం లేదు

సామాన్య ప్రజల సత్తాని చాటే ఘటన ఇది. మాయ మాటలు చెప్పి తప్పించుకు తిరిగే రాజకీయనాయకులకి సాధారణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే……….

హర్యానా, సిర్సా జిల్లాలోని అకేలా, పానిహరి గ్రామాలు.. ఆ గ్రామాలకే కాదు, వాటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కూడా దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాలంటే ఘగ్గర్ అనే నది అడ్డుగా ఉంది. దానితో సుమారు లక్షా ఇరవైవేల మంది ప్రజలు పట్టణం వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సివచ్చేది. రైతులు తమ పంటని మార్కెట్ లో అమ్ముకోవాలన్నా ఇంత దూరం అదనంగా ప్రయాణం చేయాల్సిందే. ఈ సమస్య తమకి తప్పాలి అంటే ఆ నదిపై ఒక బ్రిడ్జి కావాలి.

brid

బ్రిడ్జి కట్టించండయ్యా అని ఆ గ్రామాల ప్రజలు ఎంతో మంది నాయకులకి విజ్ఞప్తి చేసారు. దండలు వేసి చెప్పారు, దండాలు పెట్టి చెప్పారు, తమ ఓటు అడిగినప్పుడు చెప్పారు, గెలిచాక చెప్పారు, చెప్పులరిగేదాకా ఆఫీసుల చుట్టూ తిరిగారు. కాంగ్రెస్, బిజెపి, లోక్ దళ్ ఇలా అన్ని పార్టీల నాయకులకి చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి ఇలా అన్ని స్తాయిల నాయకులకి విజ్ఞప్తి చేసారు. ఇలా ఒక ఏడు కాదు, రెండేళ్ళు కాదు, పదేళ్ళు కూడా కాదు, ఏకంగా ముప్పై ఏళ్ల బట్టి అడుగుతూనే ఉన్నారు. రాజకీయనాయకులు, అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు. బ్రిడ్జి పని మాత్రం మొదలు పెట్టలేదు. దానితో ఆ గ్రామాల ప్రజలకి కడుపు మండింది. ఒక బ్రిడ్జి కోసం ముప్పై ఏళ్ళు అడుక్కోవాలా అనే పౌరుషం వచ్చింది.

“ప్రభుత్వం బ్రిడ్జి కట్టాలంటే కోట్లు కావాలి కాని, మనం తలచుకుంటే అంత ఎందుకు అవుతుంది? మనం పూనుకుని మనమే జాగ్రత్తగా దగ్గరుండి పనిచేయించుకుంటే తక్కువ ఖర్చు తోనే బ్రిడ్జి కట్టుకోవచ్చు కదా” అనే ఆలోచన వచ్చింది.

ప్రభుత్వాన్ని అడగడం ఇక అనవసరం, మనమే తలా ఇంత చందా వేసుకుని బ్రిడ్జి కట్టుకుందాం అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే ఆలస్యం, అదే రోజు ఒక కూలీ తనవంతుగా 500 రూపాయలు చందా ఇచ్చాడు, ఒక వృద్దురాలు వెయ్యి రూపాయలు పించన్ డబ్బులు విరాళంగా ఇచ్చింది. ఇలా జనం పూనుకుని,చందాలు వసూలు చేసుకుని తామే కాంట్రాక్టర్ ని సెలెక్ట్ చేసుకుని బ్రిడ్జి పని మొదలు పెట్టించారు. 214 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తం డబ్బు ప్రజల విరాళాల ద్వారానే సమకూర్చుకున్నారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. బ్రిడ్జి ప్రారంభోత్సవం చేయాలి, ఎవరితో ఓపెన్ చేయించాలా అని ఆలోచించిన గ్రామస్తులు, మొదటి విరాళం ఇచ్చిన రోజు కూలీ, పెన్షన్ డబ్బులు విరాళంగా ఇచ్చిన వృద్దురాలు వీరిద్దరే చీఫ్ గెస్ట్ లు అని డిసైడ్ అయిపోయారు. అయితే కథ ఇంతటితో అయిపోలేదు. తమకి బ్రిడ్జి కట్టించకుండా ముప్పై ఏళ్ళు ఇబ్బంది పెట్టిన రాజకీయనాయకులకి వాళ్ళు ఘాటైన సమాధానం ఇచ్చారు.

ఈ బ్రిడ్జి కేవలం ప్రజలకోసం మాత్రమె, రాజకీయనాయకులు ఎవరికీ ఈ బ్రిడ్జి పై ప్రవేశం లేదు అని తీర్మానం చేసారు. “ఇది ప్రజల కోసం, ప్రజలద్వారా, ప్రజలే నిర్మించుకున్న ప్రజాస్వామ్య వారధి” అని ప్రజలు గర్వంగా చెబుతున్నారు. మన దేశం లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణం అయిన తొలి బ్రిడ్జి గా “ఘగ్గర్ వంతెన” చరిత్ర కెక్కింది. అకీలా పానిహరి గ్రామాల ప్రజలకి స్నేహహస్తం సొసైటీ సెల్యూట్ చేస్తోంది.

3 Comments

on బ్రిడ్జీపైకి రాజకీయనాయకులకు నో ఎంట్రీ అని చెప్పిన గ్రామ ప్రజలకు హాట్సాఫ్ ……...
  1. Donakondamadhu
    |

    Nice every politician feel shame. Politiciansdon’t escape to pay income tax your the main thief

  2. MOHAN
    |

    Shame politics…

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...