దేవాలయాల పునరుద్ధరకులు కాశిరెడ్డి నాయన గారు.

October 30, 2016

కాశిరెడ్డి నాయన ఒక అవధూత. మానవత్వం ఆయన మహత్యం. అన్నదానం ఆయన తపస్సు.

ఈ ప్రపంచంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఏదో ఒక సమయంలో మాత్రమే ఆహారం లభిస్తుంది. మిగతా వేళల్లో లభించదు. కానీ ఏ వేళ అయినా , ఎంత మంది వెళ్ళినా కూడా ఎటువంటి కొరతా లేకుండా భోజనం లభించే క్షేత్రం ఒకటుందని మీకు తెలుసా……..? అవును ……..మీరు చదువుతున్న ఆ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదే నిత్యాన్నదానం తో వర్ధిల్లుతున్న జ్యోతి క్షేత్రం.

ఈ జ్యోతిక్షేత్రానికి ఇంతగా పేరు రావడానికి కారణం కాశిరెడ్డి నాయన గారు. కాశిరెడ్డి నాయన అనే అవధూత పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది ఆయన చేసిన , చేయిస్తున్న అన్నదానం. తర్వాత గుర్తుకొచ్చేది దేవాలయాల పునురుద్ధరణ.

pa-ias

కాశిరెడ్డి నాయన ఎవరంటే………….

నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లె గ్రామానికి చెందిన కాశమ్మ , సుబ్బారెడ్డి అనే దంపతులకు కాశిరెడ్డి నాయన జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నతనం నుండీ ఆధ్యాత్మిక భావాలు ఉండేవి.

ఆయనకు వివాహం చేయాలని కుటుంబీకులు , బంధువులు తీవ్ర ఒత్తిడి చేయడంతో , అది ఇష్టం లేని ఆయన ఊరు వదిలి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ పాడు బడ్డ దేవాలయాలను పునరుద్దరిస్తూ , అక్కడ ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయించేవారు.

నల్లమల కీకారణ్యంలో జనమేజయుడు ప్రతిష్టించిన నరసింహస్వామిని సందర్శించి అక్కడ కొన్నేళ్ళపాటు తపస్సు చేసారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆకలిగొన్నవారికి పిడికెడు అన్నం పెట్టండి అని అందరికీ బోధిస్తూ ఉండేవారు. కడప, కర్నూలు, నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో అనేక పాడుబడిన దేవాలయాలను పునరుద్ధరించి వాటిల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు.

ఇందులో భాగంగానే జ్యోతిక్షేత్రంలోని నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి 1995 డిసెంబర్ 6 వ తేదీన జ్యోతి క్షేత్రంలో దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేయించి , వేలాది మంది భక్తులను అక్కడకు రప్పించి అందరి సమక్షంలో ఆయన కన్నుమూసి సమాధి స్థితి పొందారు. అప్పటి నుండి జ్యోతి క్షేత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది.

కాశినాయన జీవించినంతకాలం ఏ పల్లెకు వెళ్ళినా అక్కడి పేదల ఇళ్ళకు వెళ్ళి వారి కుండల్లో ఏది ఉంటే అది తిని, వారిని ఆశీర్వదించి వెళ్ళేవారు.

చుట్టూ ఎత్తైన కొండలు………పచ్చని చెట్లు………..ఆహ్లాదకరమైన వాతావరణం…………ప్రకృతి రమణీయతతో కళకళలాడే నల్లమల అడవుల్లోని జ్యోతి క్షేత్రం లో ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు జరుగుతాయి .ఏ దిక్కూ లేనివారికి కాశినాయన దిక్కు అనే సామెత నేడు చాలా ప్రాంతాల్లో వినబడటానికి కారణం, జ్యోతి క్షేత్రంలో అందరికీ దొరికే ఆశ్రయం, నిత్యాన్నదానం. ఈ క్షేత్రం చాలా మంది అనాధల బ్రతుకులకు వెలుగునిస్తూ నిత్య జ్యోతి క్షేత్రంగా వెలుగొందుతోంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...