తమ సంపదనంతా దేశానికి , సైనికులకు రాసిచ్చిన దంపతులు

November 6, 2016

మీరు ఎంతో మంది దేశభక్తులను చూసి ఉండొచ్చు. ఎంతో మంది దాతలను చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది ….. దేశభక్తి , దాన గుణం ఉన్న గొప్ప కుటుంబం గురించి.

పుణేలోని వృద్ధ దంపతులు తమ పెద్ద మనసును వీలునామా ద్వారా తమ దేశభక్తిని, దాన గుణాన్ని చాటిచెప్పారు. తమ ఆస్తినంతటినీ దేశానికి రాసిచ్చేశారు. సైనికులు, వారి కుటుంబాలు, రైతుల కోసం తమ సంపదను ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వారి సంతానం కూడా సమ్మతించడం మరో విశేషం.

military

73 ఏళ్ళ ప్రకాశ్ కేల్కర్, ఆయన భార్య దీప కలిసి సంయుక్త వీలునామా రాశారు. ప్రకాశ్ మాట్లాడుతూ తనకు ఈ ఆలోచన 2013లో వచ్చిందన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకున్నామన్నారు.

ఓ జాతీయ బ్యాంకు సహకారంతో ఈ వీలునామాను రాస్తున్నామని తెలిపారు. తమ సంపదలో 30 శాతం ప్రధాన మంత్రి సహాయ నిధికి, 30 శాతం ముఖ్యమంత్రి సహాయ నిధికి, 30 శాతం సైనిక దళాలకు, 10 శాతం సమాజం కోసం పాటుపడే 5 స్వచ్ఛంద సంస్థలకు రాసి ఇస్తున్నామని తెలిపారు.

ప్రకాశ్ అనేక బహుళ జాతి కంపెనీల్లో కాటన్ ఎక్స్‌పర్ట్‌గా పని చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన సంపద మొత్తాన్ని సైనికులు, వారి కుటుంబాలు, రైతులు, ప్రకృతి వైపరీత్యాల బాధితుల కోసం ఖర్చు చేయాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు.

తమ నిర్ణయాన్ని తమ కుమార్తెలిద్దరూ స్వాగతించారని, వారిద్దరూ జీవితంలో స్థిరపడినవారేనని పేర్కొన్నారు. ఇటీవలే 40 మంది రైతు వితంతువులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు.

ప్రకాశ్ ధన సహాయం మాత్రమే కాకుండా నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు కూడా సహకరిస్తూ ఉంటారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...