క్యాన్సర్ రోగుల పాలిట దేవుళ్ళు ఈ డాక్టర్లు

November 20, 2016

క్యాన్సర్ వస్తే , ఇక ప్రాణాలు పోయినట్లే అని భావించే వాళ్లకు వైద్య సాయం చేసి ప్రాణాలు పోస్తున్న దంపతుల గురించి , వారి సేవల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.డాక్టర్ స్వప్నిల్‌ మానె ,
ఆయన భార్య డాక్టర్ సోనాలీ మాణే పేద క్యాన్సర్ రోగులకు దేవుళ్ళయ్యారు.

గొప్ప సేవా హృదయంతో ‘డాక్టర్ మాణే మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్’ను స్థాపించి ,
ఎందరికో ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.

dr-swapnil

షిర్డీకి 40 కిమీల దూరంలో ఉన్న ఈ ముఫ్పై పడకల చారిటబుల్ హాస్పిటల్ ఇప్పటి వరకు మొత్తం 349 క్యాన్సర్ సర్జరీలను ఉచితంగా చేసింది. ఇంకా దాదాపు 60 మంది ఆపరేషన్‌కు రెడీగా ఉన్నారు.

అలాగే స్వప్నిల్ టీమ్ మారుమూల గ్రామాల్లో 47 క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంపుల ద్వారా క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నవారిని గుర్తించి, వారిని క్యాన్సర్ నుంచి బయటపడేసింది.

అంతేకాదు, క్యాన్సర్ పేషెంట్స్ శారీరకంగా కంటే మానసికంగా బాగా కుంగిపోతుంటారు. అందుకే ఈ హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్లకు ఫ్రీగా మెడిటేషన్ క్లాసులు చెప్పిస్తుంటారు.

అలా వారికి మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం పెంపొందించేలా చేస్తారు.

ఆ వైద్యుల మాటల్లోనే ……..

‘‘మా టీమ్‌లో మొత్తం 13మంది డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. అందరూ సేవా దృక్పథంతో పనిచేసేవారే. ఇప్పటి వరకు మేము మహారాష్ట్రలో 52 గ్రామాల్లో ఫ్రీ క్యాన్సర్ చెకప్, అలాగే మందుల పంపిణీ క్యాంపులు నిర్వహించాం. మనదేశంలో ఏడాదికి 50వేల మంది మహిళలు సెర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)తో మరణిస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. అందుకే మా టీమ్ మైస్‌గావ్, తహారాబాద్ అనే రెండు మారుమూల గ్రామాలను దత్తత తీసుకుంది.

అక్కడ 550 మంది పేషెంట్లకు ఫ్రీగా సెర్వికల్ క్యాన్సర్ ఆపరేషన్ చేశాం. అలాగే 106 క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. కేవలం రెండేళ్లలో అక్కడ సెర్వికల్ క్యాన్సర్ అన్న మాటే లేకుండా చేశాం. వ్యాధి ముదరక ముందే, దాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే… ప్రస్తుతం క్యాన్సర్ పెద్ద జబ్బే కాదు’’ అని ఆనందంగా చెప్పారు స్వప్నిల్. ఇలాంటి మానవతామూర్తులు ప్రతి చోటా ఉంటే… పేదరికంలో మగ్గుతున్న వ్యాధిగ్రస్తులు మరణశయ్య ఎక్కవలసిన అవసరం ఉండదు.

వారి ఆనందమే మాకు చాలు…

చారిటబుల్ హాస్పిటల్ గురించి స్వప్నిల్ చెప్పినప్పుడు సంతోషించాను. ఆయనెప్పుడూ పేద రోగుల గురించే ఆలోచించే వారు. కేవలం డబ్బు లేదనే కారణంగా ఎంతోమంది చనిపోతున్నారని బాధపడేవారు. ఆయన వల్లే నేనూ ఈ పుణ్యకార్యంలో చేయి కలిపాను. అద్దె బిల్డింగ్‌తో కష్టమవుతోందని, ‘సాయిధామ్’ పేరుతో సొంత చారిటబుల్ హాస్పిటల్‌ను ప్రారంభించాం. పేషెంట్లు కోలుకున్నాక, వారి కళ్లలో కనిపించే ఆనందాన్నే మా సంపదగా భావిస్తామని సోనాలి గారు చెప్పారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...