క్యాన్సర్ ను ముందుగానే కనిపెట్టే పరికరం

November 11, 2016

క్యాన్సర్… ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులలో ఇది కూడా ఒకటి. చాలా సందర్భాల్లో కణితి ముదిరేవరకూ ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఇలాంటప్పుడు ట్యూమర్ ఏర్పడుతున్న ప్రారంభదశలోనే గుర్తించగలిగితే క్యాన్సర్ మూలాలు కూడా లేకుండా చేయవచ్చు.

వ్యాధి నిర్ధారణ దగ్గరి నుంచి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇతర చికిత్సల వరకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం ద్వారా క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ఇప్పుడు మరింత సులభం అయింది. తొలిదశలోనే ఉన్న క్యాన్సర్ కణితిని వెతికిపట్టుకోవడానికి వచ్చిన కొత్త పరికరమే హై డెఫినిషన్ పెట్ స్కాన్.

d3

మొట్ట మొదట్లోనే …………

అనారోగ్యం కలిగినప్పుడు శరీర ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. ఆ తరువాతే మనకు పైకి వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించేవరకు అనారోగ్యం కలిగిందని గుర్తించలేం. మొట్టమొదట జీవప్రక్రియల్లో కలుగుతున్న మార్పుల దశలోనే వాటిని గుర్తించగలిగితే మరింత త్వరగా చికిత్స అందించవచ్చు. ఈ మార్పులను ప్రారంభదశలోనే గుర్తిస్తుంది పెట్ స్కాన్.

ఉదాహరణకు క్యాన్సర్ విషయంలో కణితి ఏర్పడటానికి ముందు ఆ భాగంలో ఉండే కణాలు అనియంత్రంగా అసహజంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కణవిభజన ప్రక్రియలో మార్పులు వస్తాయి. అలా అసాధారణమైన కణవిభజన ప్రక్రియను ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్‌ని అంత సులువుగా తరిమేయవచ్చు.

పెట్ స్కాన్ ఇలా వ్యాధి ప్రారంభదశలోనే జీవక్రియల్లో జరిగే మార్పులను గుర్తించగలుగుతుంది కాబట్ట్టే కణుతులు పూర్తిగా ఏర్పడకముందే క్యాన్సర్ ఉందనే విషయాన్ని కనుక్కోవచ్చు. అంతేకాదు ఎటువంటి చికిత్స అందించాలో కూడా నిర్ణయించుకోవడం సులభం అవుతుంది.

పెట్ స్కాన్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏది అవసరమో అదే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉందో కనుక్కోవడానికి చేసే ఇన్వేసివ్ పద్ధతులను చేసే అవసరం ఉండదు. అంతేకాదు, క్యాన్సర్ దశను బట్టి చేసే శస్త్రచికిత్సలతో పనిలేదు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాదు.. పేషెంటుకు అనవసరమైన ఇబ్బందులుండవు. క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతుంటాయి కాబట్టి వీటి జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. ఈ కణాలు పెట్ స్కాన్‌లో తక్కువ సాంద్రతతో కనిపిస్తాయి.

పెట్ స్కాన్ ఎలా పనిచేస్తుందంటే……..

పెట్, సిటి రెండింటి సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకుని పనిచేస్తుంది పెట్ సిటి స్కాన్. ఈ పరీక్షకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ముందుగా రేడియోలేబల్ రూపంలోని గ్లూకోజ్‌ని ట్రేసర్ ఇంజక్షన్‌గా ఇస్తారు. ఒక గంట సమయంలో ఈ ట్రేసర్ రోగి శరీరమంతా వ్యాపిస్తుంది. రోగి శరీరంలోకి ఎక్కించిన ఈ రేడియో యాక్టివిటీ ఆరు గంటల వరకు ఉంటుంది. ట్రేసర్ శరీరం అంతా వ్యాపించిన తరువాత స్కానింగ్ మొదలవుతుంది.

రోగి పడుకున్న బల్ల స్కానర్ కింద ముందుకు వెళ్తూ ఉంటుంది. సిటి చేయడానికి ఓ నిమిషం సమయం పడుతుంది. తరువాత పెట్ స్కానింగ్ వైపు రోగి పడుకున్న బల్ల కదులుతుంది. పెట్ స్కానర్‌లో రోగి చుట్టూ కొన్ని వందల రేడియేషన్ డిటెక్టర్లు ఉంటాయి. రోగికి ఎక్కించిన రేడియోన్యూక్లైడ్ ఎమిషన్స్ (ఉద్గారం)ని బట్టి ఆయా శరీర భాగాల జీవక్రియల రేటును కొలుస్తారు. ఈ సంకేతాలను 3 డైమెన్షనల్ చిత్రాలుగా తయారుచేస్తుంది కంప్యూటర్. ఇలా ప్రతి కణ జాల పనితీరును నిర్ధారిస్తారు.

స్కానింగ్ సమయంలో చిన్న శబ్దం వస్తూ ఉంటుంది. బల్ల ముందుకు కదులుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు చిత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షకు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే మొత్తం పరీక్ష కోసం 2 నుంచి 3 గంటల వరకు ఇందుకోసం రోగి తన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...