ఒకప్పుడు బాగా బ్రతికిన తండ్రిని , భిక్షగాడుగా మార్చిన కొడుకు

November 22, 2016

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకటరమణ. ఇతనిది వరంగల్‌ జిల్లా గాంధీనగర్‌.
ఇతను గతంలో వ్యవసాయం చేస్తూ , వచ్చిన దాంట్లో తనవద్దకు వచ్చిన వారికి లేదనకుండా
సాయం చేసేవాడు. ఇతనికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు.

raitu

ఆరేళ్ల క్రితం భార్య సాలెమ్మ చనిపోయింది. కుమారుడు సుబ్బరాయుడు గాంధీనగర్‌లోనే
వ్యవసాయం చేస్తున్నాడు. ఎంతో సాఫీగా సాగుతున్న వీళ్ళ జీవితంలో కలకలం రేగింది.
కుమారుడి పెళ్లయ్యాక కష్టాలు మొదలయ్యాయి. సంపాదించిన డబ్బంతా కుమార్తెలకే ఇచ్చేశాడన్న అనుమానంతో భార్య మాటలు విని ఇతన్ని కుమారుడు వేధించడం మొదలుపెట్టాడు.
చివరకు బలవంతంగా ఇంటి నుంచి గెంటేశాడు.

అయినా మనసు నిబ్బరం చేసుకుని కొన్నాళ్లు పొలం గట్లమీద పడుకున్నాడు.
తెలిసిన వారు ఇంత తిండి పెడితే కాలం గడిపేవాడు. బాగా బతికినవాడు కావడంతో సొంతూరిలో గట్టు మీద, పుట్టమీద బతుకు ఈడ్చేకంటే బిచ్చమెత్తుకుని తిరుమల వెంకన్న పాదాల చెంత ప్రాణాలు వదలాలని తిరుపతికి వచ్చేశాడు. తిరుపతి, రాజంపేట, కోడూరుల్లో కూడా కొద్ది రోజులు భిక్షాటన చేశాడు.

ఇప్పుడు తిరుపతి స్విమ్స్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఉదయం రూ.20 ఖర్చుపెట్టి టిఫిన్ చేసి, మధ్యాహ్నం, రాత్రి స్విమ్స్ లో రోగులకు పెట్టే దేవుడన్నం తిని బతుకుతున్నాడు.

భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులతో ఇక్కడే బట్టలు ఉతుక్కుని, ఆస్పత్రి వద్ద ఉన్న విశ్రాంతి గదుల్లో రూ.10 ఇచ్చి మంచం తీసుకుని పడుకుంటున్నాడు. ఒకవేళ ఎవరూ డబ్బులివ్వకుంటే దేవుడన్నం తిని అక్కడే పడుకుంటాడు.

ఆయన తన దీన స్థితి ని వివరిస్తూ , “ నా జీవితంలో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు. పొట్టకూటికోసం ఎవరినీ మోసం చేయను. దొంగతనం చేయను. తెలిసీ తెలియక ఎప్పుడే పాపం చేశానో ఈ రోజు నాకీ గతి పట్టింది. పది మందికీ పట్టెడన్నం పెట్టిన చేతులతో ఇప్పుడిలా దేహీ అని భిక్షాటన చేసుకుంటున్నాను అని కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నాడు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...