ఈ ధర్మశాలలోని రోగులకు అంతా ఫ్రీ………. ఫ్రీ………… ఫ్రీ……….

November 15, 2016

నేటి సమాజంలో మానవ సంబందాలకంటే , మనీ సంబంధాలే ఎక్కువయ్యాయి. ఇది మనలో చాలా మంది అంగీకరించే విషయమే. అలాంటి ఈ స్థితిలో ప్రాణాంతక రోగమైన క్యాన్సర్ బాధితులకు
ఉచిత వసతి కల్పిస్తూ , ఆహార సదుపాయాలను కూడా అందిస్తున్న ధర్మశాల మనదేశంలోనే ఉంది.

‘శ్రీమాతా ట్రస్టు’ వారు నిర్వహిస్తోన్న ‘రాజస్థానీ ధర్మశాల’ చెన్నైలో ఉంది. అక్కడ కులమతాలకు అతీతంగా క్యాన్సర్ రోగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగువారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.

dharmasala-chennai

అడయార్, గాంధీనగర్‌లోని ఈస్ట్ కెనాల్ బ్యాంక్ రోడ్డు ప్రారంభంలోనే ఈ ధర్మశాల మనకు దర్శనమిస్తుంది.
అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఈ స్థలాన్ని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కి ఇచ్చారు. స్థానికంగా వున్న ‘తమిళనాడు రాజస్థానీ అసోసియేషన్’వారు సేవా దృక్పథంతో ఆ స్థలంలో మూడంతస్థుల భవనాన్ని ఉచితంగా కట్టించారు. 1999 మే 2వ తేదీన అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ భవనాన్ని ప్రారంభించారు.

రాజస్థానీలు కట్టించిన భవనం కాబట్టి
దీనికి ‘మోహన్‌దేవి హీరాచంద్ నాహర్ రాజస్థానీ ధర్మశాల’ అని పేరు పెట్టారు.

గ్రామాల నుండి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పేదలకు బస, ఆహార సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ ధర్మశాల ఆరంభంలో అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ వారికి భారంగా మారింది.

దీంతో డాక్టర్ వి.శాంత గారు కాంచీపురం శంకరాచార్య జయేంద్ర సరస్వతిని కలుసుకుని, పరిస్థితిని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన తన భక్తుడు వి.కృష్ణమూర్తిని పిలిచి,
ధర్మశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆజ్ఞాపించారు.

గురువు మాట పాటించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఐదంకెల జీతాన్ని వదులుకుని
వి. కృష్ణమూర్తి గారు పన్నెండేళ్ల కిత్రం ధర్మశాల సేవలు ప్రారంభించారు.

ధర్మశాలలోని నిబంధనావళి ఏమిటంటే……….

అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నుండి ఎంపిక చేసిన పేదవారికి మాత్రమే ఈ ధర్మశాలలో ఆశ్రయం కల్పిస్తారు. ఈ విషయంలో ధర్మశాల ప్రమేయం ఏమీ ఉండదు. ఇనిస్టిట్యూట్‌లోనే అర్హులైన వారిని ఎంపిక చేసి, అడ్మిషన్ ఫారం యిచ్చి ధర్మశాలకు పంపుతారు. పేషెంట్‌తోపాటు ఒక సంరక్షకునికి (అటెండర్) కూడా ధర్మశాలలో ఆశ్రయం కల్పిస్తారు.

బాధితులతో పాటు ఒకరే ఉండాలనే నిబంధన వున్నా, మానవతా దృక్పథంతో క్యాన్సర్‌తో బాధపడే చిన్నారుల విషయంలో మాత్రం తల్లిదండ్రులిద్దరినీ అనుమతిస్తున్నారు. రోగిని పరామర్శించేందుకు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సందర్శన వేళలుగా నిర్ణయించారు. రోగికి విధిగా బెడ్ కేటాయిస్తారు.

రోగులకు అందించే సౌకర్యాలు ఎలా ఉంటాయంటే……..

వైద్యుల సూచనలను అనుసరించి సమయం ప్రకారం ఆహారం అందజేస్తారు. ఉచితంగా వసతి కల్పిస్తోంది కాబట్టి ఏదో ఆషామాషీగా భోజనం పెట్టేస్తారనుకుంటే పొరపాటే! ఉదయం – 6.30కి కాఫీ, 7.30కి టిఫిన్ -ఇడ్లీ, సాంబారు (వారంలో ఒకరోజు మరో రకం టిఫిన్ పెడతారు) మధ్యాహ్నం – 12 తరువాత భోజనం (రెండు కూరలు, పప్పు, రసం, మజ్జిగ), సాయంత్రం – పాలు, రాత్రి – భోజనం (వెరైటీ రైస్, రసం, మజ్జిగ). వారానికి మూడు రోజులపాటు అంటే బుధ, గురు, శుక్రవారాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.

అప్పుడప్పుడు భజన కార్యక్రమాలు ఉంటాయి. వేదాద్రి మహర్షి యోగా సెంటర్‌కి చెందిన యోగా టీచర్లు స్వచ్ఛందంగా ధర్మశాలలోని క్యాన్సర్ బాధితులకు యోగా శిక్షణ ఇస్తున్నారు. ట్రీట్‌మెంట్ కోసం «ధర్మశాల నుండి అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లేందుకు ఇనిస్టిట్యూట్ బస్సు ఎప్పుడూ అందుబాటులో వుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల్నే ధర్మశాలకి రప్పించి రోగులకు చికిత్స అందజేస్తారు.
******

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...