అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాలు ఏమిటంటే….

October 4, 2016

అహోబిళం
*******
పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు.
ఈ క్షేత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు దగ్గరలో సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది.

పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం.

ahobilam

ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది.
అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు ఆలయ అభివృద్ధికి తోడ్పడినారు.

15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం కొంత భాగం ద్వంసమైపోయింది.
రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు.
ఇది ఇప్పటికి మనం చూడవచ్చు.

పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు.

అహోబిల మహత్యం ఏమిటంటే…..

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి.
రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము.

ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.

పార్వేట
******
అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వానిస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రధమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండీ ఈ నాటివరకు పార్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము.

ఎగువ అహోబిలము
***************
ఎగువ అహోబిలం నందు వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము కలదు.

దిగువ అహోబిలము
**************
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.

చరిత్ర
*****
ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది.

అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు.

హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, మనుష్యులు నివశించేందుకు భయపడేవారని వ్రాశారు.

ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచుపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేదని ఆయన వ్రాశారు.

1 Comment

on అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాలు ఏమిటంటే…..
  1. Pallapotu Venkata Krishna
    |

    Very good,it is very interesting to us thank you so much for your information

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...