అర్ధరాత్రి ఇసుక బస్తాలు మోసి , ఊరి జనాన్ని కాపాడిన ఆఫీసర్

November 8, 2016

అర్ధరాత్రివేళ ఇసుక బస్తాలు మోసి ,ఊరి జనాన్ని కాపాడి , ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అని జ‌నాలందరిచేత ప్ర‌శంస‌లు అందుకున్నారు స‌బ్ క‌లెక్టర్ అర‌వింద్ కుమార్‌.

aafeesar

అసలేం జరిగిందంటే……..

అర‌వింద్ కుమార్ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బాలియాకు జిల్లాకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇటీవల వ‌చ్చిన వ‌ర‌ద‌లు యూపీని అత‌లాకుత‌లం చేసిన విషయం మనందరికీ తెలిసినదే. అదే స‌మ‌యంలో బాలియాకు కూడా తీవ్రంగా వ‌ర‌ద పోటెత్తెంది. ఈ క్ర‌మంలో అదే జిల్లాలోని బైరియా అనే గ్రామం వ‌ద్ద ఉన్న ఓ భారీ డ్యామ్‌కు పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు రాసాగింది. అయితే ఆ డ్యామ్ ఎంతో పురాతన‌మైంది. ఈ క్ర‌మంలో అంత‌కు కొద్ది రోజుల ముందు నుంచే దానికి మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు కొన‌సాగుతున్నాయి.

అయితే వ‌ర‌ద‌ల కార‌ణంగా పెద్ద ఎత్తున నీరు అందులోకి వ‌స్తుండ‌డంతో దానికి కూలిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. దీన్ని గ‌మ‌నించిన సైట్ ఇంజినీర్లు, కూలీలు డ్యామ్ నుంచి దూరంగా వెళ్లిపోసాగారు.
ఈ విష‌యంపై స‌బ్ క‌లెక్ట‌ర్ అర‌వింద్ కుమార్‌కు కూడా వారు స‌మాచారం అందించారు. అప్పుడు రాత్రి 2 గంట‌లు అయింది.

అయితే అంత అర్ధ‌రాత్రి స‌మ‌యంలోనూ భారీ వ‌ర్షాన్ని లెక్క చేయ‌కుండా అర‌వింద్ త‌న కారులో డ్యామ్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. వెంట‌నే చుట్టు ప‌క్క‌ల ఉన్న గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా అప్రమత్తం చేశాడు. అయితే డ్యామ్ సైట్ వ‌ద్ద అత‌నికి పెద్ద ఎత్తున ఇసుక సంచులు క‌నిపించాయి. వెంట‌నే ఆ ఇసుక సంచుల‌ను స్వయంగా ఎత్తి నెత్తిన పెట్టుకుని డ్యామ్ కూలిపోతున్న ప్ర‌దేశం వ‌ద్ద‌కు చేరుకుని అక్క‌డ ఆ ఇసుక సంచుల‌ను వేయ‌సాగాడు.

అయితే స‌బ్ క‌లెక్ట‌రే స్వయంగా ప‌నిచేస్తుండ‌డం చూసిన తోటి ఇంజినీర్లు, కూలీలు వెనుదిరిగి వారూ త‌మ వంతు బాధ్య‌త‌గా ఇసుక సంచుల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు. వీరికి కొంద‌రు గ్రామ‌స్తులు కూడా జ‌త క‌లిశారు. అంతే, కొద్ది సేప‌ట్లోనే అక్క‌డ దాదాపు 400 మంది దాకా పోగ‌య్యారు. వారంద‌రూ డ్యామ్ క‌ట్ట‌కు ఇసుక సంచుల‌ను అత్యంత వేగంగా త‌రలిస్తూ ఎట్ట‌కేల‌కు దాన్ని కూల‌కుండా కొంత సేపు ఆపారు.

అలా ప్ర‌మాదం త‌ప్పాక అర‌వింద్ వెంట‌నే నేష‌నల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్‌) బృందాల‌కు డ్యామ్ గురించి స‌మాచారం అందించాడు. వారు వెంటనే అప్ర‌మ‌త్త‌మై అక్క‌డికి చేరుకుని గ్రామ‌స్తుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అనంత‌రం 36 గంట‌ల‌కు డ్యామ్ కూలింది.

అయితే అప్ప‌టికే గ్రామ‌స్తులంతా ఖాళీ చేసి వెళ్ల‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అలా త‌మ‌ను ర‌క్షించినందుకు ఆయా గ్రామాల ప్ర‌జ‌లు అరవింద్‌ను ఎంత‌గానో ప్ర‌శంసించారు. మెచ్చుకున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...