అన్ని రకాల క్యాన్సర్లకూ చికిత్సను అందించే ఆసుపత్రి

November 15, 2016

క్యాన్సర్ – మనుషుల ప్రాణాలను హరింపజేసే అతి భయంకర వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన రోగితో పాటు గా కుటుంబం మొత్తం కూడా పూర్తిగా నిరాశా నిస్పృహలలో మునిగిపోతారు. ఎందుకంటే ఈ వ్యాధి ప్రభావం రోగితో పాటుగా ఆర్ధికంగా కుటుంబంపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

అటువంటి క్యాన్సర్ మహమ్మారి కి చికిత్సను అందించేందుకు ఆరు దశాబ్దాల క్రితమే మన దక్షిణ భారత దేశంలో ఒక గొప్ప ఆసుపత్రిని నెలకొల్పారు. అక్కడ అన్నిరకాల క్యాన్సర్లకూ చికిత్సను అందిస్తున్నారు.

adayar-hospital

ఆ ఆసుపత్రే అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి. ఈ క్యాన్సర్ ఆసుపత్రి ని చెన్నై లో నెలకొల్పిన గొప్ప వ్యక్తి శ్రీ ముత్తులక్ష్మీ రెడ్డి. మన దేశంలో వైద్య శాస్త్రంలో మొట్టమొదటగా పట్టా పుచ్చుకున్న మహిళ ఆమె.

తన తోబుట్టువుకు క్యాన్సర్ సోకి, సరైన వైద్యం లభించక మృతి చెందడంతో ఆ విషాదం నుంచి అమె
ఓ పట్టాన తేరుకోలేకపోయారు. కాస్త కుదుట పడిన తర్వాత అలా మరెవ్వరికీ జరగకూడదనే ఉద్దేశ్యంతో “క్యాన్సర్ ఆసుపత్రి” ప్రారంభించారు. ఉమెన్స్ ఇండియన్ అసోషియేషన్ (WIA) ద్వారా సేకరించిన నిధులతో ఇన్‌స్టిట్యూట్ కు శ్రీకారం చుట్టారు. 1954, జూన్ 18 న కేవలం ఇద్దరు గౌరవ వైద్యాధికారులు, ఓ టెక్నీషియన్, ఇద్దరు ఆక్జిలరీ నర్స్ లతో చిన్న చిన్న గుడిసెల్లో 12 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.

ప్రస్తుతం చికిత్స, పరిశోధన, రోగుల పునరావాసం వంటి అంశాలతో సమగ్ర క్యాన్సర్ నిరోధక కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూట్ ను స్వతంత్ర ప్రతిపత్తిగల గవర్నింగ్ బాడీ నడుపుతోంది. సంస్థ వ్యవస్థాపకురాలైన డా. ముత్తులక్ష్మీ రెడ్ది కుమారుడు డాక్టర్ కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా, డాక్టర్ శాంతగారు ఛైర్మన్ గా ఉన్నారు. సంస్థను భారత ప్రభుత్వం 1975 లో దక్షిణ భారతదేశ ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంగా ప్రకటించింది. ఒక ప్రైవేటు సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన గుర్తింపునివ్వడం ఇదే ప్రథమం.

డాక్టర్ శాంత గారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కు సంబంధించి అధునాతనమైన వైద్య సౌకర్యాలు ఆల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటరైజ్డ్ బయోగ్రఫీ లను మూడు దశాబ్దాల క్రితమే ప్రవేశపెట్టారు. నూక్లియర్ మెడికల్ అంకాలజీ, సైటాలజీ, లింపాంజియోగ్రఫీ, మమోగ్రఫీ, ఫైబర్ ఆప్టిక్ గ్యాస్ట్రో ఎండోస్కొపీ వంటి ఆధునిక పరికరాలనూ, రేడియో థెరపీ విభాగాలను , క్లినికల్ రీసెర్చ్ బయో కెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ ట్యూమర్, మైక్రో బయాలజీ తదితర పరిశోధనా కేంద్ర విభాగాలను ఏర్పాటు చేశారు. రొమ్ము క్యాన్సర్ ల మీద ఈమె చేసిన పరిశోధనలు శస్త్రచికిత్సలకు బాగా ఉపకరిస్తున్నాయి.

అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్న ఈ అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి
రోగులకు వర ప్రసాదమని చెప్పవచ్చు.

ఆసుపత్రి అడ్రస్ :

CANCER ISTITUTE
NO . 38 , SARDAR PATEL ROAD ,
ADYAR ,
CHENNAI 600036
PH : 044 22209150

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...