అంతకంతకూ పెరుగుతున్న బసవన్న విగ్రహం – ఆ పురాతన ఆలయం మహత్యం ఏమిటంటే……

November 7, 2016

శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం – యాగంటి
*******************************
కర్నూలు జిల్లాలో బనగానపల్లి కి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి.
ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి కూడా ఒకటి.

యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది.
తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని…..
కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి
ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది.

yaganti

లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన
సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు.
ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది.
ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం.పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది.

ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగివున్నది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళయం వున్నాయి. గర్బాలయంలో లింగరూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి.

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి.
వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాడు.
ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు.
ఆ ప్రక్కనే ఇంకో గుహ లో బ్రహ్మం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోనోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనినిశంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు.

ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి
ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆవిగ్రహాన్ని మలుస్తూ వుండగా బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవనిచెబుతుంటారు.

ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణచేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది.కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్థావించబడి ఉంది.యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగానపల్లి లో వసతులున్నాయి.
ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది.
కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...